: ‘పన్నీర్’ రాజీనామాకు ఒత్తిడి చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి: స్టాలిన్ డిమాండ్
తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం తన పదవికి రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంకే నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో శత్రుభావం చూపబోమని, ప్రభుత్వం సవ్యంగా నడిచేందుకు తాము సహకరిస్తామని చెప్పిన ఆయన, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా గవర్నర్ విద్యాసాగర్ రావు చొరవ చూపాలని కోరారు. అసెంబ్లీని వెంటనే సమావేశ పరచాలని, లేని పక్షంలో ఏ పార్టీకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందో చూడాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. స్టాలిన్ తో పన్నీర్ సెల్వం రహస్య మంతనాలు జరిపారంటూ శశికళ చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, అంశాల పరంగా సమర్థిస్తున్నామే తప్పా, పన్నీర్ సెల్వంను తమ పార్టీ ఎప్పుడూ సమర్ధించలేదని స్పష్టం చేశారు. జయలలిత మృతిపై విచారణ జరపాలని పన్నీర్ సెల్వం నిర్ణయించడాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు.