: ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్న శశికళ వర్గం
పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో అప్రమత్తమైన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వేగంగా పావులు కదుపుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఎమ్మెల్యేలు హాజరుకాగానే శశికళ తన వ్యూహం అమలుచేశారు. తనకు మద్దతు తెలుపుతున్నట్టు వారి నుంచి సంతకాలు సేకరించారు. మరోపక్క, ఈ సాయంత్రం పార్టీ ఎంపీలు రాష్ట్రపతిని కలవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ మేరకు ఎమ్మెల్యేలను వివిధ రహస్య ప్రాంతాలకు తరలించారు. పన్నీర్ సెల్వం, డీఎంకే, బీజేపీ వంటి పార్టీల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు నెలకొనకుండా ఆమె అనుచరులు ఎమ్మెల్యేల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, వారి నుంచి ఎలాంటి సమాచారం ఇతరులకు చేరకుండా చర్యలు చేపట్టారు. దీంతో తమిళనాట కలకలం రేగుతోంది. అధికారం కోసం శశికళ వేస్తున్న ఎత్తులు, కదుపుతున్న పావులను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.