: ఒక్కసారిగా పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడానికి కారణాలు ఇవిగో..!
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన తరువాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. శశికళ సీఎం పదవిని చేపట్టడానికి పావులు కదుపుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిన్న చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. అయితే, ఆయన రెబల్‌గా మారడానికి గల కారణాలను పరిశీలిస్తే జయలలిత మృతి తరువాత శశికళ వైఖరిపై పన్నీర్ సెల్వంలో అసంతృప్తి చెలరేగింది. అమ్మ మృతి తరువాత సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ షాడో సీఎంగా శశి జోక్యం చేసుకున్నారని ఆయనలో అగ్రహం నెలకొందని రాజకీయ పండితులు చెబుతున్నారు.
ఆయనను పార్టీలో ఎన్నో సార్లు అవమానించారని అంటున్నారు. అయినప్పటికీ ఆ విషయాలను బయటపెట్టని పన్నీర్ సెల్వం తాజాగా ఒక్కసారిగా తనలో ఉన్న అసంతృప్తిని బద్దలు కొట్టారని చెబుతున్నారు. నిన్నటి వరకు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై గళం విప్పడానికి వెనుకాడిన పన్నీర్ సెల్వానికి నిన్న జరిగిన పరిణామాలు కారణమయ్యాయి. నిన్న పార్టీ నేతలు అనూహ్యంగా శశికళ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేయడం, జయ మరణానికి శశికళే కారణమని పాండ్యన్ వంటి పార్టీనేతలు విమర్శలు చేయడంతో పన్నీర్ సెల్వం ధైర్యం తెచ్చుకొని నోరు విప్పారు.
జయలలిత అక్రమాస్తుల కేసు విషయంలో త్వరలో తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో శశికళ కూడా నిందితురాలే. దాంతో ఈ తీర్పు వచ్చే వరకు వేచి చూడాలన్న ఆలోచనలో కేంద్ర ఉన్నందున, శశికళను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించలేదన్న వార్తలొచ్చాయి. ఇదే సమయంలో శశికళ తీరుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేదనే ప్రచారం జరగడం కూడా పన్నీర్ గళం విప్పడానికి కారణమయ్యాయి.
జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమెను చూసేందుకు పన్నీర్ సెల్వంకు అవకాశం ఇవ్వకపోవడం కూడా ఓ కారణంగా నిలిచింది. అమ్మ నమ్మిన బంటుగానే కాకుండా పన్నీర్ సెల్వం చేసిన ఈ కొన్ని రోజుల పాలన ప్రజలకు నచ్చింది. జల్లికట్టు, వార్ధ తుపాన్ సమయంలో సమర్థవంతంగా పనిచేయడంతో పన్నీర్ సెల్వం పట్ల ప్రజల్లో సానుభూతిని పెరిగింది. దీంతో మరింత ధైర్యం కూడగట్టుకున్న పన్నీర్ సెల్వం తిరుగుబాటుకి దిగారు.