: శశికళకు ఆ అర్హతలు ఉన్నాయా?: సినీ నటి గౌతమి ప్రశ్న
ఒక రాష్ట్రానికి లేదా దేశానికి అత్యున్నత పదవిని అధిష్ఠించే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలేంటని సినీ నటి గౌతమి అడిగారు. చెన్నైలో ఆమె మాట్లాడుతూ, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తికి కావాల్సిన అర్హతలేంటని నిలదీశారు. అవన్నీ శశికళకు ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు శశికళకు మద్దతు పలుకుతున్నవారంతా ఎన్నికలకు వెళ్లగలరా? ప్రజా తీర్పు కోరగలరా? అని ఆమె నిలదీశారు.
తనను బలవంతంగా రాజీనామా చేయించారని ఒక ముఖ్యమంత్రి సూటిగా చెబితే... వెనుక ఎలాంటి కుట్రలు జరిగి ఉంటాయో ఊహిస్తే ఆందోళన కలుగుతుందని ఆమె అన్నారు. జయలలిత మరణం వెనుక నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యేలే కొన్ని విషయాలు బయటపెడుతున్నారని, వాటిని ఎందుకు నమ్మకూడదో నిందితులు చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. జయలలిత స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఆమె చెప్పారు. దీపా జయకుమార్ జయలలిత స్థానం భర్తీ చేయగలరని తాను భావించడం లేదని, ఆమె కాదు ఎవరూ జయలలిత స్థానాన్ని భర్తీ చేయలేరని ఆమె స్పష్టం చేశారు.