: భార్యా పిల్లలతో కలసి ఎంజాయ్ చేస్తున్న బరాక్ ఒబామా!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికా 44వ అధ్యక్షుడిగా సేవలందించిన ఒబామా 20 రోజుల క్రితం అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. దీంతో భార్య, పిల్లలతో కలసి బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ కు సంబంధించిన బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ లోని మస్కిటో ద్వీపంలో ఆయన సేదదీరుతున్నారు. 2007లో వర్జిన్ ఐలాండ్స్ లో గల మస్కిటో ద్వీపాన్ని బ్రాన్సన్ కొనుగోలు చేసి, 22 మంది అతిధులకు సరిపడేలా లగ్జరీ హోటల్ ను నిర్మించారు. ఆయన కూడా అక్కడే ఉంటున్నారు.
ఆ ద్వీపంలో ఒబామా ఎంజాయ్ చేస్తున్న క్షణాలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన రిచర్డ్ బ్రాన్సన్ ఆయన బాల్యంలోకి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చుట్టూ భద్రత ఉండేదని, క్షణం తీరిక ఉండేది కాదని, ఇప్పుడు ఒబామా స్వేచ్ఛగా నిజమైన విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వాటర్ స్పోర్ట్స్ ఆడుకుంటున్న ఒబామా ఫోటోలను రిచర్డ్ పోస్టు చేశారు. అధ్యక్షుడిగా ఉండగా, ఆయన వాటర్ స్పోర్ట్స్ లో పాల్గొనాలని కోరితే భద్రతా సిబ్బంది అనుమతించలేదని, తన నుంచి బీచ్ లో కైట్ సర్ఫింగ్ ఎలా చేయాలో రెండు రోజుల పాటు నేర్చుకుని ఆయన ఆడుతున్నారని రిచర్డ్ తెలిపారు.