: పన్నీర్ సెల్వంపై చర్యలు తీసుకోవడం నా బాధ్యత: శశికళ
అన్నాడీఎంకే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై గళం విప్పుతున్న తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై శశికళ నటరాజన్ నిప్పులు చెరిగారు. చెన్నైలో ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... పన్నీర్ సెల్వం చేస్తోన్న తప్పుల పట్ల స్పందించి చర్యలు తీసుకోవడం పార్టీ జనరల్ సెక్రటరీగా తన బాధ్యత అని చెప్పారు. పార్టీలోని విభేదాలకు పుల్ స్టాప్ పెట్టే బాధ్యత తనపై ఉందని చెప్పారు. పన్నీర్ సెల్వంతో డీఎంకే కుమ్మక్కయినట్లు పరిస్థితులు స్పష్టంగా తెలియజేస్తున్నాయని అన్నారు. అమ్మ బాటలోనే తాము నడవాలని అనుకుంటున్నామని, తమని ఎవ్వరూ ఆపలేరని ఆమె వ్యాఖ్యానించారు. తన ప్రసంగంలో ఆమె పదే పదే అమ్మ జయలలిత పేరును ప్రస్తావించారు. తాను ఇన్నాళ్లు అమ్మ కోసమే జీవించానని, ఇకపై కూడా ఆమె ఆశయాల కోసమే పనిచేస్తానని అన్నారు.