: ఈ విషయంలో మాత్రం శశికళ, పన్నీర్ లది ఒకే మాట!
నిన్నటి నుంచి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వేడిని రగిల్చిన శశికళా నటరాజన్, పన్నీర్ సెల్వంలు ఒక విషయంలో మాత్రం ఒకే మాటను చెబుతున్నారు. అదే తమకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య విషయం! అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని పన్నీర్ సెల్వం చెబుతుంటే, తన వెనుకే ఎమ్మెల్యేలు ఉన్నారని శశికళ అంటున్న పరిస్థితి. అమ్మ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విషయంలో కూడా ఇద్దరి వ్యాఖ్యలూ ఒకేలా ఉన్నాయి.
ఇక ఈ ఉదయం అన్నాడీఎంకే సమావేశంలో శశికళ, తన బలాన్ని చూపించి, పార్టీలో ప్రస్తుతానికి తనకు తిరుగులేదని నిరూపించారు కూడా. ఈ విషయంలో పన్నీర్ మాత్రం ఇంకా తన బలాన్ని ఏ రూపంలోనూ మీడియా ముందు చూపించలేకపోయారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలంతా టచ్ లో ఉన్నారని, బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకుంటానని సవాల్ విసిరారు. తన వెనుక ఎలాంటి బలం, బలగం లేకుండా పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటాను ఎగరవేయలేరన్నది రాజకీయ పండితుల అభిప్రాయం. మరి ఆయన ఎలా దాన్ని ముందుకు తీసుకువస్తారన్న ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానం చిక్కలేదు.