: ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ శశికళకు ఉందా?
తమిళనాడు అధికార పార్టీ అన్నా డీఎంకేలో సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో శశికళ నటరాజన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన కీలక భేటీలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో శశికళ ముఖ్యమంత్రి కాగలదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శశికళ ముఖ్యమంత్రి కావాలంటే ఆమె పన్నీర్ సెల్వంను ఒంటరిని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆమె వైపు 70 మంది ఎమ్మెల్యేలు బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అన్నాడీఎంకేలో మిగిలింది మరో 50 మంది ఎమ్మెల్యేలు. దీంతో పన్నీర్ వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 15 మందికి మించనీయకుండా ఆమె చూసుకోవాల్సి ఉంటుంది.
ఆ ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే ఆమెకు కీలకంగా మారింది. మరోవైపు డీఎంకేతో పాటు పన్నీర్‌కి బీజేపీ కూడా మద్దతిస్తోంది. అయితే, కాంగ్రెస్ శశికళకు సహకరిస్తే ఆమె బలం పుంజుకుంటుంది. కానీ, ఆ పార్టీ శశికళకు సహకరించే పరిస్థితులు అక్కడ లేవు. దీంతో శశికళ సీఎం కావడం కష్టమేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.