: రాజీనామా వెనక్కి తీసుకుంటా: పన్నీర్ సెల్వం మరో ఎత్తు
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం 12 గంటల వ్యవధిలో రెండోసారి మీడియా ముందుకు వచ్చారు. మూడు రోజుల క్రితం గవర్నర్ కు ఇచ్చిన రాజీనామాను వెనక్కు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. రాజీనామా వద్దని పార్టీ నుంచి, కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందని తెలిపిన ఆయన, తన జీవితంలో ఇంతవరకూ పార్టీకి ఎలాంటి ద్రోహం చేయలేదని, ఇకపై కూడా చేయబోనని స్పష్టం చేశారు.
పార్టీకి విధేయుడిగానే ఉన్నానని, అమ్మ చెప్పిన మాటలు ఇంకా తన చెవుల్లో మెదలుతూనే ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు తృణప్రాయమని, అన్నాడీఎంకే పార్టీ కోసం ప్రాణాలు వదలడానికైనా సిద్ధమని తెలిపారు. అమ్మ తనను పార్టీ కోశాధికారిగా నియమించారని, ఇప్పుడున్నవారిలో తనను పదవికి దూరం చేసే ధైర్యం ఎవరికీ లేదని శశికళ పేరు చెప్పకుండానే పన్నీర్ సెల్వం నిప్పులు చెరిగారు. బీజేపీ తనను నడిపిస్తోందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. మరోసారి మిత్రులతో చర్చించి రాజీనామా వెనక్కు తీసుకుంటానని తెలిపారు.