: అధికారం లేని శశికళ... మాట చెల్లని పన్నీర్... ప్రభుత్వం లేకుండా అనాధగా తమిళనాడు!


ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఉన్నారు... కానీ ఆయన మాటను ఏ అధికారీ వినడం లేదు. అధికారంలో ఉన్న పార్టీ పెద్దగా శశికళ ఉన్నారు... కానీ, అధికారులకు ఆదేశాలు ఇవ్వడానికి ఆమెకు అధికారం లేదు. మంత్రులు ఉన్నారు... వారు ఎవరి పక్షమో తేలని సందిగ్ధత. ఏ మంత్రి మాట వినాలో తెలియని పరిస్థితిలో అధికార యంత్రాంగం. ఎవరి మాట వింటే భవిష్యత్తులో ఏమవుతుందోనన్న బెంగ.

ఈ పరిస్థితుల్లో పాలన పడకేసి, ప్రభుత్వం లేని అనాధగా తమిళనాడు మిగిలినట్టు కనిపిస్తోంది. బిల్లుల చెల్లింపులు గత మూడు నాలుగు రోజులుగా జరగలేదని తెలుస్తోంది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు కూడా అందలేదని సమాచారం. మామూలుగా వీరికి ప్రతినెలా మొదటి వారంలో వేతనాలు అందుతూ ఉండేవి. రాష్ట్ర ఖజానా నుంచి అత్యవసర చెల్లింపులు మినహా మరే ఇతర అవసరాలకూ నిధులు కదలడం లేదని అధికారులే స్వయంగా చెబుతున్నారు. సంక్షేమ పథకాలకు, వృద్ధాప్య పింఛన్లకు సైతం నిధుల వాటా పంచలేదని తెలుస్తోంది.
తమిళనాడులో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని, ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియని స్థితిలో ఉన్నామని అధికార యంత్రాంగం వాపోతోంది. గవర్నర్ వచ్చి పరిస్థితిని చక్కబెట్టే వరకూ ఇలాగే కాలం వెళ్లదీయాల్సిందేనని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం మాట చెల్లని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News