: ట్రంప్‌కు కౌంట్‌డౌన్ మొదలు.. అభిశంసన ద్వారా సాగనంపేందుకు వ్యూహ రచన!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రోజులు దగ్గరపడ్డాయా? త్వరలో ఆయన పదవీచ్యుతుడు కాబోతున్నాడా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అన్ని వైపుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒక్క అమెరికాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే మాట చెబుతున్నారు. ట్రంప్‌ను వీలైనంత త్వరగా వదిలించుకునేందుకు రిపబ్లికన్  పార్టీ వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన రెండు వారాల్లోనే తన నిర్ణయాలతో ప్రపంచం చేత గగ్గోలు పెట్టిస్తున్నారు. ఆయన తీరుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. దీంతో ట్రంప్‌పై విశ్వాసం కోల్పోయిన ప్రజలు ఆయనను అధ్యక్ష పదవి నుంచి దింపడమే మంచిదని అభిప్రాయపడుతున్నారని తాజా సర్వే ఒకటి బయటపెట్టింది. దేశంలోని మూడొంతుల మంది ప్రజలు ట్రంప్‌ను అభిశంసించాలని కోరుకుంటున్నట్టు సర్వే వెల్లడించింది.

మరోవైపు ట్రంప్‌పై సొంతపార్టీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. ఆయనను ఎక్కువకాలం కొనసాగించడం మంచిది కాదని భావిస్తున్నారు. ఆయనను బలవంతంగా సాగనంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో ఏడాదిన్నర లోపే ట్రంప్‌ను అభిశంసన ద్వారా లేదంటే 25వ రాజ్యాంగ సవరణను ప్రయోగించడం ద్వారా గద్దె దింపాలని యోచిస్తున్నట్టు సమాచారం. ట్రంప్ స్థానంలో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం అమెరికాలో ఎక్కడ చూసినా ట్రంప్ అభిశంసనపైనే చర్చలు జోరుగా సాగుతుండడం ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది.  ట్రంప్‌ను అభిశంసించదగ్గ అంశాలు చాలానే ఉన్నాయని, ఆయన తమకు భారంగా మారినట్టు రిపబ్లికన్లు ఎప్పుడు తెలుసుకుంటారనేదే ప్రస్తుత ప్రశ్న అని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్‌ను అభిశంసించాలన్న ఉద్యమం అమెరికాలో క్రమంగా బలపడుతుండడం కూడా ట్రంప్ భవితవ్యంపై ప్రభావం చూపనున్నట్టు చెబుతున్నారు.

More Telugu News