: రెండుగా చీలిన అన్నాడీఎంకే.. రాష్ట్రపతి పాలన దిశగా తమిళనాడు!
తమిళనాడులో మంగళవారం రాత్రి నుంచి రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న శశికళకు పన్నీర్ సెల్వం షాకివ్వడంతో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం రెండుగా చీలిపోయింది. పన్నీర్‌కు 50 మంది వరకు ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నారు. దీంతో శశికళ బలం 85కు పడిపోయింది. తనకు మద్దతు పలుకుతున్న 85మంది ఎమ్మెల్యేలతో ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు అసాధ్యం.
ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరోవైపు ప్రతిపక్ష డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కున్న 8 మంది ఎమ్మెల్యేలను కలుపుకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి గవర్నర్‌పై పడింది. ఆయన ఎవరిని ఆహ్వానిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎవరికీ సరైన మద్దతు లేకపోవడంతో తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నట్టు చెబుతున్నారు.