: ‘ట్రీ మ్యాన్ సిండ్రోమ్’ బాలికకు ఆపరేషన్ విజయవంతం!


శరీర అవయవాలపై చర్మం చెట్ల కొమ్మలు, బెరడులా పెరగడాన్ని ‘ట్రీ మ్యాన్ సిండ్రోమ్’ గా చెబుతారు. ఈ అరుదైన వ్యాధికి గురైన
బంగ్లాదేశ్ తొలి బాలిక షహానా ఖాతూన్ కు నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైంది. ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోని బర్న్స్ యూనిట్ లో షహానాకు చేసిన ఆపరేషన్ విజయవంతమైందని, మరో ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపినట్లు స్థానిక పత్రికలో పేర్కొన్నారు. ప్లాస్టిక్ సర్జరీ యూనిట్ చీఫ్ అబుల్ కలాం ఆజాద్ ఆధ్వర్యంలోని ఆరుగురు వైద్యుల బృందం షహానాకు ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.

కాగా, నెట్రొకోనలోని పేద రైతు కుటుంబానికి చెందిన షహానాకు ఏడాది వయసు ఉన్నప్పుడే ‘ట్రీ మ్యాన్ సిండ్రోమ్’ లక్షణాలు కనిపించాయి. ఆమెకు ఆరేళ్ల వయసు వచ్చేసరికి ఆ వ్యాధి మరింత పెరిగింది. ఎనిమిదేళ్లు వచ్చే సరికి ఆమె చెవులు, కుడి మోకాలిపై చర్మం పెరగసాగింది. దీంతో, స్థానికంగా ఉండే హోమియో పతి వైద్యుడిని సంప్రదించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఢాకా లోని వైద్య కళాశాలకు షహానాను ఆమె తండ్రి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించడంతో ఈ అరుదైన వ్యాధి ఉన్నట్లు బయటపడింది. కాగా, అబుల్ బజందర్ అనే ఇరవై ఆరు సంవత్సరాల యువకుడు గతంలో ‘ట్రీ మ్యాన్ సిండ్రోమ్’ బారిన పడ్డాడు. అతనికి కూడా ఇదే ఆసుపత్రిలో 18 సార్లు ఆపరేషన్లు నిర్వహించాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News