: రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ములాయం సింగ్ చిన్న కోడలు
ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన, లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లకు తాను వ్యతిరేకమని, వెనుకబడిన జాబితాలో ‘యాదవ’ కులం ఉన్నప్పటికీ, తన కూతురికి రిజర్వేషన్ అవసరం లేదని అన్నారు. తాము బాగా కలిగిన కుటుంబానికి చెందిన వాళ్లమని, అలాంటప్పుడు, రిజర్వేషన్లను ఎందుకు ఉపయోగించుకోవాలని ప్రశ్నించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి ఉమా భారతి ఒక ప్రకటన చేశారు. యాదవ కులస్తుల్లో ఎంతో మంది వెనుకబడిన వారు ఉన్నారని, అపర్ణ చేసిన వ్యాఖ్యలు తనకు ఎంతో బాధ కలిగించాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.