: ‘సోషల్ ట్రేడ్’ వ్యవహారంలో బాలీవుడ్ నటి సన్నీలియోన్ ని ప్రశ్నించనున్న అధికారులు!


ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ‘సోషల్ ట్రేడ్ బిజ్’ ఆన్ లైన్ ప్రకటనలతో అధిక ఆదాయం సంపాదించవచ్చంటూ  లక్షలాది మంది వినియోగదారులను మోసం చేసిన వ్యవహారంలో ఆ సంస్థ నిర్వాహకుడు అనుభవ్ మిట్టల్ ను పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై  ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్ టీ ఎఫ్) దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ను కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు డీఎస్పీ రాజ్ కుమార్ మిశ్రా తెలిపారు. గత ఏడాది 29న ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో ఉన్న క్రౌన్ ప్లాజా హోటల్ లో అనుభవ్ మిట్టల్ ఇచ్చిన పార్టీకి హాజరైన సన్నీ లియోన్, ‘సోషల్ ట్రేడ్ బిజ్’ పోర్టల్ ను ప్రారంభించిందని, ఆ సంస్థకు సన్నీ లియోన్ ప్రచారం చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.

అంతేకాకుండా, అనుభవ్ మిట్టల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కలిసి సన్నీ లియోన్, అమీషా పటేల్ దిగిన ఫొటోలు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సన్నీ లియోన్ ని ప్రశ్నించనున్నామని, ‘ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్కుల్యేషన్ స్కీమ్స్ చట్టం 1978 ప్రకారం, ఆ తరహా స్కీమ్ లకు ప్రచారం నిషేధమని, ఆ ప్రచార కార్యక్రమంలో సన్నీ లియోన్ పాల్గొన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆ అధికారి చెప్పారు. కాగా, ‘సోషల్ ట్రేడ్ బిజ్’ ఆన్ లైన్ సంస్థ సుమారు ఆరున్నర లక్షల మంది నుంచి రూ.3,700 కోట్లు వసూలు చేసింది.  

  • Loading...

More Telugu News