: రహస్య ఆపరేషన్‌లో భాగంగా దుశ్చర్య.. సిరియా జైలులో సుమారు 13 వేల మందికి ఉరి
సిరియాలో జరుగుతున్న దారుణం గురించి మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పలు విషయాలు తెలుపుతూ ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి సైడ్‌నయా జైలులో సుమారు 13 వేల మందిని ఉరి తీశారని పేర్కొంది. బషర్ అల్ అసద్ సర్కారుపై వస్తోన్న వ్యతిరేకతను అణచివేసే క్రమంలో సిరియాలో రహస్య ఆపరేషన్ నిర్వహించారని, అందులో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపింది. ఓ రోజు అర్ధరాత్రి ఆ జైలులో ఉన్నవారిని మరో జైలుకు తరలిస్తున్నామంటూ తీసుకెళ్లారని, అనంతరం జైలు అండర్‌గ్రౌండ్‌లో వారిని ఉరి తీశారని ఆ సంస్థ చెబుతోంది.
తాము సంవత్సరం పాటు 84 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించామని, అనంతరం ఈ నివేదికను రూపొందించామని తెలిపారు. తమకు సాక్ష్యం అందించిన వారిలో ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సెక్యూరిటీ గార్డ్స్, జడ్జీలు, లాయర్లు, పట్టుబడినవాళ్లు ఉన్నారని పేర్కొంది. మృతుల్లో చాలామంది సర్కారు వ్యతిరేకులేనని చెప్పింది. వారంతా సర్కారుని వ్యతిరేకిస్తోన్న అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులని చెప్పింది.