: బీచ్‌లో బికినీ షోలు చేయాలని అనుకున్నారు: ప్రభుత్వంపై రోజా విమర్శలు
త్వరలో మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని ఆ సదస్సులో ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ఈ సదస్సులో మహిళా సాధికారత మీద డిక్లరేషన్ చేయడానికి తాము మద్దతు తెలుపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆడవారిపై ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నేతలు విశాఖపట్నంలోని బీచ్‌లో బికినీ షోలు చేయాలని అనుకున్నారని ఆరోపిస్తూ, మహిళలని అవమానించడంలో తారస్థాయికి చేరిన చర్యగా దానిని ఆమె అభివర్ణించారు. తామంతా కలిసి పోరాడాం కాబట్టి దాన్ని ఆపేశారని, అయితే ఇంకా మహిళలకు ఏం అన్యాయం చేస్తారోనని తమకు అనుమానంగా ఉందని ఆమె అన్నారు.
బాల్య వివాహాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌లో ఉంచారని రోజా చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని విమర్శించారు. మెడికో సంధ్యారాణి చావుకి కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. మంత్రి కామినేనిని పదవి నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. పయ్యావుల కేశవ్ అనుచరులు నడిరోడ్డుపై మహిళలను కొట్టించారని ఆమె అన్నారు. వీటన్నిటినీ గురించి సదస్సులో ప్రశ్నించే అవకాశం ఇవ్వాలని ఆమె అన్నారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తారనని చెప్పిన చంద్రబాబు వారిని ఇప్పుడు రోడ్డుపై నిలబెట్టే పరిస్థితికి తీసుకొచ్చారని ఆమె చెప్పారు.