: ఆనాడు ఇదే రోజు... పాక్ పై కుంబ్లే ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన వేళ..!
ఫిబ్రవరి 7, 1999... భారత క్రికెట్ ప్రేమికులు మరచిపోలేని రోజు. లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, పాకిస్థాన్ పై ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లూ తీసిన వేళ... నేటికి సరిగ్గా 18 సంవత్సరాల క్రితం జరిగిందీ ఘటన. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సెకండ్ ఇన్నింగ్స్ లో 420 పరుగుల గెలుపు లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు కుంబ్లే దెబ్బకు పేకమేడలా కుప్పకూలింది. కేవలం 74 పరుగులు మాత్రమే ఇచ్చిన కుంబ్లే, ఆటగాళ్లందరినీ ఒక్కొక్కరిగా పెవీలియన్ దారి పట్టించాడు.
చివరి రెండు వికెట్లనూ కుంబ్లే తీస్తే, అరుదైన రికార్డు వస్తుందన్న భావనతో, ఫాస్ట్ బౌలర్ శ్రీనాధ్, తనకు వికెట్లు దక్కకూడదన్న ఉద్దేశంతో, వికెట్లకు దూరంగా బంతులేసిన సంగతి కూడా ఆనాడు మ్యాచ్ చూసిన వారికి గుర్తుండే ఉంటుంది. 100 పరుగులకు వికెట్ నష్టపోకుండా పటిష్ఠంగా ఉన్న పాక్ జట్టు, కుంబ్లే విజృంభణతో 207 పరుగులకు ఆలౌటైంది. పదో వికెట్ పడగానే, సచిన్, హర్భజన్, శ్రీనాధ్ సహా ఆటగాళ్లంతా కుంబ్లేను హత్తుకుని అభినందించారు.