: ఉగ్రవాదంపై ట్రంప్ నడుస్తున్న మార్గం సరైనదే: ఆఫ్గన్ అంబాసిడర్
ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరైన మార్గంలోనే సాగుతున్నారని ఇండియాలో ఆఫ్గనిస్థాన్ దౌత్యాధికారి షైదా మొహమ్మద్ అబ్దాలీ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ సెమినార్ లో పాల్గొన్న ఆయన, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పెను సవాళ్లలో టెర్రరిజం ఒకటని, దీన్ని సమూలంగా తుడిచిపెట్టాల్సిందేనని అన్నారు. అమెరికా కొత్త ప్రభుత్వం తన విధానాలతో ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయగలదని అన్నారు. ఈ మార్గంలో ఇండియా కూడా ముందు నిలుస్తుందన్న నమ్మకముందని తెలిపారు. ఈ రీజియన్ లో శాంతి నెలకొనే దిశగా, ఆఫ్గనిస్థాన్ కీలకమని, తమ దేశం ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని అన్నారు. చైనాతో తమ దేశం మిత్రబంధాన్ని కోరుకుంటోందని, వారి వనరులను వినియోగించుకుంటూ అభివృద్ధి చెందాలన్నది తమ లక్ష్యమని అబ్దాలీ వెల్లడించారు. పాక్ బంధాలపై స్పందిస్తూ, రెండు దేశాల మధ్యా శాంతి, ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయని అన్నారు.