: రిలయన్స్ జియోపై యుద్ధానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. సీసీఐకి లేఖ


ఉచిత ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలకు నిద్రను దూరం చేసిన రిలయన్స్ జియోపై యుద్ధానికి భారతీ ఎయిర్‌టెల్ సిద్ధమైంది. జియోపై ఆఫర్లపై ఇప్పటికే ‘ట్రాయ్’కు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎయిర్‌టెల్ తాజాగా కాంపిటిషన్ కమిషన్ ఇండియా(సీసీఐ)కి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. ఉచిత ఆఫర్ల పేరుతో జియో దోపిడీకి  పాల్పడుతోందంటూ లేఖలో ఆరోపించింది. ఉచిత ఆఫర్ల  పేరుతో పోటీదారులను మార్కెట్ నుంచి తప్పించాలని, తద్వారా ఏకఛత్రాధిపత్యం సాగించాలని జియో చూస్తోందని పేర్కొంది.

జియో ఆఫర్లతో చిన్న సంస్థలు మార్కెట్ నుంచి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. మార్కెట్‌లో ఓసారి పాతుకుపోయిన తర్వాత చార్జీల మోతతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తుందని ఆరోపించింది. అయితే ఎయిర్‌టెల్ ఆరోపణలను జియో ఖండించింది. తమకు వ్యతిరేకంగా సాగుతున్న కుట్రలో భాగంగానే ఎయిర్‌టెల్ ఈ ఆరోపణలు చేస్తున్నట్టు జియో అధికార ప్రతినిధి పేర్కొన్నారు. జియో ఆఫర్లు ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నట్టు ఇది వరకే ట్రాయ్ స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News