: ఏ హక్కుతో శశికళ అక్కడ ఉంటున్నారు?.. నిలదీసిన నటుడు టి.రాజేందర్
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై ఆల్ ఇండియా లాచియా ద్రవిడ మున్నేట్ర కజగం(ఏఐఎల్‌డీఎంకే) వ్యవస్థాపకుడు, నటుడు టి.రాజేందర్ మండిపడ్డారు. జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లో ఆమె ఏ హక్కుతో ఉంటున్నారని నిలదీశారు. శశికళ ఇలా హడావిడిగా ఎందుకు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. అందులో ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. శశికళ సీఎం కావడం ఆ పార్టీలోని వారికే ఇష్టం లేదని పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత పలు సందర్భాల్లో ‘మక్కళాల్ నాన్..మక్కళుక్కాగవే నాన్’ అని చెప్పేవారని గుర్తుచేశారు. అంటే తనకు ఎవరితోనూ ఎలాంటి బంధాలు లేవని దాని అర్థమని వివరించారు. అటువంటప్పుడు జయతో శశికళకు ఎటువంటి సంబంధముందని ప్రశ్నించారు. ఏ హక్కుతో ఆమె పోయెస్ గార్డెన్‌లో ఉంటున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జయలలిత తర్వాత అంతటి అర్హత ఉన్నవారే సీఎం బాధ్యతలు చేపట్టే హక్కు ఉంటుందని రాజేందర్ స్పష్టం చేశారు.