: దేశాన్ని నాశనం చేసే పార్టీతో వారు ‘చేయి’ కలిపారు: వెంకయ్య నాయుడు
దేశాన్ని నాశనం చేసే పార్టీతో సమాజ్ వాదీ పార్టీ ‘చేయి’ కలిపిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకాన్ని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు రెండూ కోల్పోయాయని, అందుకే జత కట్టాయని అన్నారు. ములాయం సింగ్ యాదవ్ దగ్గర నుంచి ‘సైకిల్’ ను తీసుకువెళ్లి కాంగ్రెస్ ‘చేతి’కి ఇచ్చారంటూ తన దైన శైలిలో వ్యాఖ్యానించారు.
యూపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని తమ పార్టీ కోరుకుంటోందని, అయితే, అధికార పార్టీ మాత్రం అందుకు అడ్డుతగులుతోందని ఆరోపించారు. జిల్లా మేజిస్ట్రేట్ ల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఈ విషయమై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని అన్నారు. సమాజ్ వాదీ పార్టీ పాలనలో యూపీ అవినీతి మయంగా మారిందని, ఈ పార్టీ మరో మారు అధికారంలోకి రావాలని అక్కడి ప్రజలు కోరుకోవడం లేదని అన్నారు. ఎస్పీ పాలనలో అభివృద్ధి కుంటుపడటమే కాకుండా, శాంతిభద్రతలూ అదుపు తప్పాయని విమర్శించారు.