: జర్నలిస్టుపై దాడితో నాకు సంబంధం లేదు.. నేను ఎవరిపైనా దాడులు చేయించను!: ఎమ్మెల్యే ఆమంచి
ఫ్రీ లాన్స్ జర్నలిస్టు నాయుడు నాగార్జున రెడ్డిపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని, వ్యక్తిగత దాడులకు తాను ఎవ్వరినీ ప్రోత్సహించలేదని ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ అన్నారు. ఈయన అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక పత్రికలో ఇటీవల ఓ కథనం వెలువడింది. ఈ కథనాన్ని వేటపాలెంకు చెందిన నాయుడు నాగార్జున రెడ్డి అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు రాశాడు. ఈ కథనంపై ఆగ్రహించిన కొందరు వ్యక్తులు రెండు రోజుల క్రితం చీరాల పోలీస్ స్టేషన్ ఎదుట నాగార్జున రెడ్డిపై దాడికి పాల్పడ్డటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ సంఘటనకు కారణం ఎమ్మెల్యే వర్గీయులేనని బాధితుడు ఆరోపించిన నేపథ్యంలో కృష్ణ మోహన్ స్పందించారు. ‘నాగార్జున రెడ్డి అనే ఒక బ్రోకర్, గతంలో నక్సల్స్ కు సానుభూతి పరుడిగా పని చేశాడు. ఆ సమయంలో రూ.50 వేలు దొంగతనం చేయడంతో అతన్ని నక్సల్స్ బహిష్కరించారు. నాగార్జున రెడ్డి ప్రాణభయంతో ఉంటే.. అతని తండ్రి చంద్రా రెడ్డి నా దగ్గరకు వచ్చి వేడుకుంటే, ఆ రోజు రాత్రికి రాత్రే హోం మంత్రి వద్ద అతన్ని సరెండర్ చేశాను. ఈ విషయం మా ప్రాంతంలో అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీ లేదా నాగార్జునరెడ్డి లాంటి బ్రోకర్లు చేస్తున్న న్యూసెన్సే ఈ సంఘటన. చీరాలలో అరాచకాలు జరగడం లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా అంత నేనుగా ప్రోత్సహించి ఎవరిపైకి దాడి చేయించలేదు..అటువంటి కేసులు కూడా లేవు.’ అని అన్నారు. ఇదిలా ఉండగా, ఫ్రీలాన్స్ జర్నలిస్టు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే వర్గీయులు తనను చంపాలనే ఉద్దేశం తోనే ఈ దాడి చేశారని ఆరోపించడం గమనార్హం.