jagan: కోతలు కొండంత కోస్తాడు.. చేతలు మాత్రం చీమ తలకాయంత కూడా వుండవు!: చంద్రబాబుపై జగన్ చురకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోతలు కొండంత కోస్తారని, చేతలు చూస్తే చీమ తలకాయంత కూడా ఉండవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. ఈ రోజు అనంతపురంలోని ఉరవకొండలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు పార్టీ పేరు తెలుగుదేశం అని, కానీ తయన పొద్దున్న లేస్తే విదేశాల్లోనే కనిపిస్తాడని అన్నారు. ఒకరోజు సింగపూర్ వెళితే, మరోరోజు దావోస్, చైనా, జపాన్.. ఇలా వెళుతుంటారని, ఏ దేశానికి వెళితే దాన్ని ఇక్కడకు తెచ్చేస్తానంటారని జగన్ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నాయుడు అవినీతి మీద యుద్ధం చేస్తామని మాట్లాడుతున్నారని, మరోవైపు ఆయన చేసేది మాత్రం పూర్తిగా అవినీతి రాజ్యమని జగన్ అన్నారు. ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అంటారా? ముఖ్య కంత్రీ అంటారా? అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు గుణగణాలు చెప్పాల్సి వస్తే మోసం, దుర్మార్గం, ప్రలోభం లాంటివన్నీ గుర్తుకొస్తాయని ఆయన అన్నారు. ఇన్ని గుణాలు చంద్రబాబులో ఉన్నా తాను చాలా మంచివాడినని నిరంతరం అసత్యాలు పలుకుతారని జగన్ అన్నారు.