: వైజాగ్ సహా పలు నగరాల్లో 'ఉబెర్ హైర్' ఆవిష్కరణ
ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ క్యాబ్ కాలింగ్ సేవలందిస్తున్న ఉబెర్, తన విస్తరణ ప్రణాళికల్లో భాగంగా సోమవారం నాడు పలు నగరాల్లో 'ఉబెర్ హైర్' సేవలను ప్రారంభించింది. ఇప్పటికే కొచ్చిలో అందుబాటులో ఉన్న ఉబెర్ హైర్ సేవలు, ఇకపై న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, అహ్మదాబాద్, వైజాగ్, నాగపూర్ నగరాల్లో కూడా అందుబాటులోకి తెస్తున్నట్టు సంస్థ ఇంజనీరింగ్ విభాగం హెడ్ అపూర్వ దలాల్ పేర్కొన్నారు. టూరిస్టులకు, వ్యాపార పనుల నిమిత్తం పర్యటనలు జరిపే వారికి, సీనియర్ సిటిజన్లకు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కు 'ఉబెర్ హైర్' ఉపకరిస్తుందని, 12 గంటల వరకూ ఒకే క్యాబ్ ను అద్దెకు తీసుకుని దానిలోనే అదనపు చార్జీలు లేకుండా అందుబాటు అద్దెల్లో పర్యటించవచ్చని అన్నారు. రెండు గంటలు, 30 కిలోమీటర్ల దూరానికి చార్జీలు రూ. 449 నుంచి రూ. 649 మధ్య, ఎంచుకునే కారు వేరియంట్ ను బట్టి వసూలు చేస్తామని, ఆపై కిలోమీటరుకు రూ. 12 వరకూ చెల్లించాల్సి వుంటుందని తెలిపారు. డైనమిక్ ప్రైసింగ్ విధానం ఉబెర్ హైర్ కు వర్తించదని స్పష్టం చేశారు. నగరాలను బట్టి వసూలు చేసే చార్జీల మొత్తం మారుతుంటుందని పేర్కొన్నారు.