: ఆశా కిరణ్ ఆశ్రమంలో అతి దారుణ పరిస్థితులు.. విస్తుపోయిన మహిళా కమిషన్
ఢిల్లీలో ప్రభుత్వ అధీనంలో కొనసాగుతున్న ఆశ్రమం నడుస్తోన్న తీరుని పరిశీలించిన మహిళా కమిషన్ షాక్ అయింది. మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పించే ఆశా కిరణ్ అనే ఓ సంస్థలో రెండు నెలల్లోనే సుమారు 11మంది మృతి చెందారు. అయితే, ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్, మరో సభ్యురాలు ప్రమీలా గుప్తా ఆ ఆశ్రమానికి వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించారు. శనివారం రాత్రంతా అక్కడే ఉండి మానసిక వికలాంగుల పరిస్థితులు చూసి విస్తుపోయారు. వారి పరిస్థితిపై స్వాతి మాలివాల్ మాట్లాడుతూ... స్నానం చేసేందుకు ఆరు బయటే మహిళలను వివస్త్రలను చేసి వరుసగా నిలబెడుతున్నారని చెప్పారు.
ఆశ్రమంలో మానసిక వికలాంగులైన మహిళలు పూర్తి నగ్నంగా అటు ఇటూ తిరుగుతున్నారని స్వాతి మాలివాల్ చెప్పారు. ఆశ్రమంలోని కారిడార్లలో సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయని, వాటిని పురుషులు ఆపరేట్ చేస్తున్నారని తెలిపారు. ఈ దృశ్యాలన్నీ చూసి తాము షాక్కు గురయ్యామని చెప్పారు. ఆశ్రమంలో పరిశుభ్రత లేదని, అవసరమైన సంఖ్యలో ఉద్యోగులు కూడా లేరని అన్నారు. అక్కడ నివసిస్తోన్న మానసిక వికలాంగులకు కనీస హక్కులు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని, 350 మందికి మాత్రమే సరిపోయే చోటులో 450 మంది మానసిక వికలాంగులను ఉంచారని, దీనిపై ఇప్పటికే తాము సాంఘిక సంక్షేమ శాఖకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. 72గంటల్లో తమకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా తాము కూడా ఒక ప్రత్యేక కమిటీని వేశామని తెలిపారు. త్వరలోనే ఇక్కడి పరిస్థితులని, అందుకు గల కారణాలను వివరిస్తూ నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని స్వాతి మాలివాల్ మీడియాకు చెప్పారు.