: ఫేస్‌బుక్‌లో లైకులు కొడుతున్నారా?.. కాస్త జాగ్రత్త సుమీ!
ఫేస్‌బుక్.. ప్రస్తుత యువత దేన్నయినా మర్చిపోతుందేమో కానీ దీనిని మాత్రం మర్చిపోదు. ఫేస్‌బుక్‌నే తింటూ, దానినే శ్వాసిస్తూ, దాంట్లోనే జీవిస్తున్నవారు ఎందరో. ఇక ఫేస్‌బుక్‌లో కనిపించిన ప్రతీ పోస్టుకు లైక్ కొడుతూ నిత్యం అందులోనే మునిగి తేలేవారు మరికొందరు. పదేపదే లైక్‌లు కొట్టడం, స్టేటస్ అప్‌డేట్ మార్చుతుండడం వెనక అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. మానసిక, శారీరక అనారోగ్యంతో బాధపడే వారే ఇలా తరచూ చేస్తుంటారని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఆరోగ్య, మానసిక పరిశోధకులు తేల్చారు.
5,200 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం బయటపడినట్టు వారు పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో పదేపదే లైకులు కొట్టేవారు అనారోగ్యంతో బాధపడుతున్నట్టు, తరచూ స్టేటస్ అప్‌డేట్ చేసేవారు మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైనట్టు వివరించారు. శరీర బరువు పెరగడానికి, ఫేస్‌బుక్ వాడకానికి సంబంధం లేదని పేర్కొన్న పరిశోధకులు బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) ఎక్కువగా ఉన్నవారు ఫేస్‌బుక్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఫేస్‌బుక్‌లో ఎక్కువగా గడపడం వల్ల వారి ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని పరిశోధనకారులు హెచ్చరిస్తున్నారు. సో.. లైకులు కొట్టేముందు ఒక్కసారి ఆలోచించండి!