: పాపం పన్నీర్!.. తమిళనాడులో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఇదే ముచ్చట!


దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత విశ్వాస పాత్రుడిగా పేరుపొందిన పన్నీర్ సెల్వంను తలచుకుని తమిళ ప్రజలు తెగ బాధపడిపోతున్నారు. ముచ్చటగా మూడుసార్లు సీఎం గద్దెనెక్కినా కరవుదీరా ఒక్కసారి కూడా ఏడాదిపాటు పాలించని ఆయనను చూసి ఆవేదన చెందుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఆయనను దునుమాడిన ప్రత్యర్థులే ఇప్పుడు ఆయనను చూసి జాలిపడుతున్నారు. ‘పాపం పన్నీర్’ అంటూ తెగ బాధపడుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతిసారీ ముఖ్యమంత్రి గద్దెనెక్కిన పన్నీర్ సెల్వం.. జయ కుదురుకున్నాక తిరిగి పదవిని పూలలో పెట్టి ‘అమ్మ’కు అప్పగించిన ఆయన రికార్డుల్లో నిలిచిపోనున్నారు.

జనవరి 14, 1951న జన్మించిన పన్నీర్ స్వగ్రామం తేని జిల్లాలోని పెరియకుళం. ఒట్టకార దేవర్, పళనియమ్మాల్ నాచ్చియార్ తల్లిదండ్రులు. పూర్తిగా వ్యవసాయ కుటుంబం. బీఏ వరకు చదువుకున్నారు. ప్రాణస్నేహితుడు షాబుద్దీన్ ఇచ్చిన ప్రోత్సాహంతో పన్నీర్ సెల్వం రాజకీయాల్లో అడుగుపెట్టారు. భార్య విజయలక్ష్మి. వీరికి ముగ్గురు పిల్లలు. అన్నాడీఎంకే కార్యకర్తగా పనిచేస్తూనే పెరియకుళంలో టీ షాపు నడిపేవారు. ఆ ప్రాంతంలో అది ఎంతో ఫేమస్. మంత్రి అయిన తర్వాత కూడా నెలకోసారి తన టీ దుకాణానికి వెళ్లి టీ తాగి వస్తుండేవారు. మృదు స్వభావిగా పేరున్న ఆయన సీఎంగా గద్దెనెక్కిన ప్రతిసారి అర్థాంతరంగానే దిగిపోవడంతో ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News