: సినిమాను తలదన్నేలా శశికళ జీవితం.. వీడియో షాపు నుంచి సీఎంగా!
సినిమా.. అదే ఊహా ప్రపంచం. కలలను ఎంచక్కా తెరపై అమ్మేస్తారు. కొన్నిసార్లు నిజ జీవిత ఘటనలు కూడా తెరకెక్కుతుంటాయి. సినిమాల్లో కనిపించే మలుపులు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అయితే అంతకుమించిన మలుపులు తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి జీవితంలో ఉండడం విశేషం. వీడియో పార్లర్‌తో జీవితాన్ని ప్రారంభించిన శశికళ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి.
శశికళ తాత చంద్రశేఖరన్ పిళ్లై రామనాథపురంలో నాటు వైద్యుడు. ఆ తర్వాత ఆయన తంజావూరు వలస వెళ్లారు. వైద్యం చేయగా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించేవారు. ఆయన కుమారుడు వివేకానందన్ ఇంగ్లిష్ మందుల దుకాణం నిర్వహించేవారు. దీంతో వారిని ‘ఇంగ్లిష్ మందుల దుకాణం వాళ్లు’ అని అందరూ పిలిచేవారు. వివేకానందన్, కృష్ణవేణి దంపతుల ఐదో సంతానమే శశికళ. డీఎంకే చీఫ్ కరుణానిధి చేతుల మీదుగా 1970లో శశికళ, నటరాజన్‌ల వివాహం జరగడం గమనార్హం. నటరాజన్ 1980లో చెన్నైలో ప్రభుత్వ పౌర సంబంధాల అధికారిగా ఉండేవారు. శశికళ అన్నాసలైలోని జెమినీ పార్సన్ కాంప్లెక్స్‌లో ‘వినోద వీడియో విజన్’ పేరుతో వీడియో క్యాసెట్ల షాపు నిర్వహించేవారు.
ఎంజీ రామచంద్రన్ 1982లో జయలలితను పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించారు. ఆ సమయంలో ఎంజీర్ సర్కారు బడిపిల్లల పౌష్టికాహార పథకాన్ని ప్రవేశపెట్టింది. కడలూరులో నిర్వహించిన ఈ పథకం ప్రచార కార్యక్రమానికి జయలలిత హాజరయ్యారు. అక్కడ జయకు అప్పటి కలెక్టర్ చంద్రలేఖతో పరిచయం ఏర్పడింది. అప్పట్లో పౌర సంబంధాల అధికారిగా ఉన్న నటరాజన్ ఆ పథకానికి విస్తృత ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న జయలలితకు చంద్రలేఖ సహాయకురాలిగా నియమితులయ్యారు. అలా క్రమంగా వీరిమధ్య సాన్నిహిత్యం పెరిగింది. జయ ఎక్కడికి వెళ్లినా చంద్రలేఖ ఆమె వెన్నంటే ఉండేవారు.
ఓ సందర్భంలో చంద్రలేఖ.. జయలలితకు శశికళను పరిచయం చేశారు. దీంతో చంద్రలేఖ లేని సమయాల్లో బోర్ అనిపించిన ప్రతిసారి జయలలిత.. శశికళ నడుపుతున్న వీడియో షాపు నుంచి ఇంగ్లిష్ సినిమాల క్యాసెట్లను తెప్పించుకుని చూసేవారు. ఈ క్రమంలో శశికళతో ప్రారంభమైన పరిచయం క్రమంగా మొగ్గతొడిగి విడదీయరానంతగా పెనవేసుకుపోయింది. 1989 నుంచి శశికళ.. జయలలితోనే ఉండిపోయారు. పోయెస్ గార్డెన్‌లోని జయ ఇంట్లో పనిచేసే వారందరినీ తన సొంతూరైన మన్నార్గుడి నుంచి శశికళ రప్పించారు.
శశికళతో విడదీయలేనంత అనుబంధాన్ని పెంచుకున్న జయలలితకు తన వెనక శశికళ నడుపుతున్న తతంగం గురించి తెలిసి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ ఆ వివరాలను జయకు అందించినట్టు చెబుతుంటారు. శశికళ నడుపుతున్న ‘తతంగం’ గురించి తెలిసిన జయలలిత.. శశికళ సహా ఆమె బంధుమిత్రులను పోయెస్ గార్డెన్ నుంచి తరిమేసి పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే ఆ తర్వాత మళ్లీ కరుణించిన జయ ఆమెను దగ్గరికి తీసుకున్నారు. అప్పట్లో శశికళను జయ దగ్గరికి తీసుకోకుంటే ప్రస్తుత తమిళ రాజకీయాలు మరో రకంగా ఉండేవని చెబుతున్నారు. ఇలా వీడియో పార్లర్ నుంచి సీఎం పదవి చేపట్టే వరకు ఎదిగిన శశికళ జీవితంలో అడుగడుగునా ఎన్నో మలుపులు కనిపిస్తాయి.