: జగన్ సాయం నాకెందుకు?.. వైఎస్ కాళ్లు పట్టుకున్నది చంద్రబాబే!: ముద్రగడ విమర్శ
కాపు ఉద్యమం కోసం వైసీపీ అధినేత జగన్ సాయం తనకు అవసరం లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. హనుమాన్ జంక్షన్‌లో ఆదివారం వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు, కాంగ్రెస్ నేత చలమలశెట్టి రమేశ్‌బాబు నివాసాల్లో కాపు నేతలతో సమావేశమైన ముద్రగడ, ఆ తర్వాత మాట్లాడుతూ టీడీపీపై దుమ్మెత్తి పోశారు. కాపు ఉద్యమం వెనక జగన్ హస్తం ఉందన్నది టీడీపీ నేతల దుష్ప్రచారం మాత్రమేనన్నారు. ఉద్యమం కోసం జగన్ సాయం పొందాల్సిన అవసరం తనకు లేదని, కాల్పుల కేసులో బావమరిది బాలకృష్ణను రక్షించేందుకు అప్పట్లో చంద్రబాబే వైఎస్ రాజశేఖరరెడ్డి కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు.
నంబరు ప్లేటు లేని కారులో చంద్రబాబు అర్ధరాత్రి సెక్యూరిటీ లేకుండా అప్పటి సీఎం అయిన రాజశేఖరరెడ్డి వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకున్నారని, బాలకృష్ణను ఆ కేసు నుంచి బయటపడేయాలని ప్రాధేయపడ్డారని ముద్రగడ అన్నారు. జ్యోతిబసు తర్వాత అంతటి అపార అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబేనని కితాబిచ్చిన ముద్రగడ, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.