: అన్నయ్యను కానీ, తమ్ముడిని కానీ ఎవరైనా విమర్శిస్తే నాకు బాధ అనిపిస్తుంది: నాగబాబు
అన్నయ్యను కానీ తమ్ముడిని కానీ ఎవరైనా విమర్శిస్తే మాత్రం తనకు చాలా బాధగా ఉంటుందని ‘మెగా’ బ్రదర్ నాగబాబు అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ వేడుక నాడు యండమూరి గురించి, వర్మ గురించి చేసిన వ్యాఖ్యలు సబబేనని అన్నారు. యండమూరి అన్నట్లు తనకు ఎటువంటి కాంప్లెక్స్ లు లేవని, చిన్నపిల్లవాడి మనస్తత్వం కాదని అన్నారు. యండమూరి గతంలో చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయని, తనను విమర్శిస్తే అసలు బాధపడనని, తన అన్నను లేదా తమ్ముడిని విమర్శిస్తే మాత్రం సహించనని, బాధ ఎలా ఉంటుందో తెలియాలనే ఆ వేడుక రోజున వాళ్లపై మండిపడ్డానని అన్నారు.
ఇంకా చెప్పాలంటే, లేటుగా వాళ్లని విమర్శించానని తాను బాధపడుతున్నానని, యండమూరి, వర్మ అంటే తనకు గౌరవమని నాగబాబు చెప్పారు.. చిరంజీవి, పవన్ కల్యాణ్ లేకపోతే నాగబాబు లేరన్న వర్మ ట్వీట్ కు బాధపడ్డారా? అనే ప్రశ్నకు నాగబాబు సమాధానమిస్తూ.. వాళ్లిద్దరూ లేకపోతే తాను ‘జీరో’ అని స్పష్టం చేశారు.