: అన్నయ్య, కల్యాణ్ లా నాకు స్టార్ డమ్ లేదనే మాట వాస్తవం: నటుడు నాగబాబు
అన్నయ్య చిరంజీవి, తమ్ముడు కల్యాణ్ బాబులా తనకు స్టార్ డమ్ లేదనే విషయం వాస్తవమని నటుడు నాగబాబు అంగీకరించారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒక పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఉండే పేరు కూడా తనకు లేదని అన్నారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు కల్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం, వాళ్ల చిత్రాలు విజయం సాధించాయా? కలెక్షన్స్ ఎన్ని వచ్చాయి? అనే విషయాలతో తన కాలం అలా సరదాగా గడిచిపోయిందని అన్నారు.
అయితే, అదే సమయంలో తన గురించి ఆలోచించుకోకపోవడంతోనే తనకు కెరీర్ లేకుండా పోయిందన్నారు. తనకు అంటూ ఒక గుర్తింపు లేదనేది వాస్తవమని, అయితే, కొంత మేరకు సంతోషంగానే ఉన్నానని చెప్పారు. ఒక రకమైన స్తబ్ధతతో కూడిన జీవితాన్ని ఇరవై ఏళ్లు గడిపానని, చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించమని అన్నయ్య చెప్పేవాడని, ఆలోచించ గలిగే శక్తి ఉంది కనుక దర్శకత్వం వహించమని తమ్ముడు కల్యాణ్ చెబుతుండేవాడని అన్నారు. అయితే, అన్నయ్య చెప్పినట్లు కష్టపడేవాడినని, కానీ, నిర్మాతగా, ఆర్టిస్ట్ గా అపజయాలు చవి చూశానని అన్నారు. జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే తాను విఫలమయ్యానని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.