: దిగని మత్తులు ఆ రెండు నాకు బాగా ఎక్కిపోయాయి: రచయిత జె.కె భారవి
నాగార్జున సినిమాలు అంటే తనకు బాగా ఇష్టమని, ఆయన నటించిన సినిమాలు ఏవీ చూడకుండా వదిలిపెట్టలేదని ప్రముఖ రచయిత జె.కె. భారవి అన్నారు. నాగార్జున తాజా చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అన్నమయ్య సినిమాతో నాగార్జునతో నాకు అనుబంధం ఏర్పడింది. నా జీవితంలో నాకు ఒక ఆస్కార్ అవార్డు ఇచ్చినా కూడా అంత సంతోషం కలగని రెండు గౌరవాలు నాకు దక్కాయి. ఒకటి.. ‘ఎప్పుడు మిమ్మల్ని చూసినా హగ్ చేసుకోవాలనిపిస్తుంది అని’ నాగార్జున గారు నాతో గతంలో అన్నారు. ఆ మాటలు ఇప్పుడు తలచుకున్నా నా కళ్లలో నీళ్లు వచ్చేంత ఆనందం. రెండోది.. అన్నమయ్య సినిమా చూసిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను హగ్ చేసుకుని ‘నాగార్జున నా కొడుకే అని నువ్వు ప్రూవ్ చేశావ్’ అని అన్నారు. ఈ రెండు మత్తులు నాకు ఎక్కిపోయాయి. ఆ రెండూ దిగని మత్తులు’ అని భారవి చెప్పుకొచ్చారు.