: ఇండియాతో తప్పనిసరి పరిస్థితుల్లోనే డీల్: 30 ఏళ్ల తర్వాత శ్రీలంక మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలు వెలుగులోకి
దాదాపు 30 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న వేళ, శ్రీలంకతో కుదిరిన ఐపీకేఎఫ్ (ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్) ఒప్పందంపై లంక మాజీ అధ్యక్షుడు దివంగత జయవర్దనే సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎల్టీటీఈ అధీనంలో ఉన్న జాఫ్నాపై దాడులకు తన సైన్యం అంగీకరించలేదని, ఈ కారణంతోనే తాను తప్పనిసరి పరిస్థితుల్లోనే భారత్ తో సైనిక ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చిందని అప్పట్లో అమెరికా దౌత్యాధికారి పీటర్ గిల్ బ్రైత్ తో జయవర్దనే తెలిపారట.
ఈ ఒప్పందం తరువాత 1987 నుంచి 1990 మధ్య భారత సైన్యం శ్రీలంకకు వెళ్లి ప్రభాకరన్ నేతృత్వంలోని తమిళ పులులతో తలపడగా, 1200 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆపై ఎల్టీటీఈ ప్లాన్ చేసి 1991 మేలో రాజీవ్ గాంధీపై ఆత్మాహుతి దాడి చేయించింది. ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్ ను భారత ప్రభుత్వం పిచ్చోడిగా లెక్కకట్టిందని జయవర్దనే తనకు చెప్పినట్టు పీటర్ కు చెందిన సీఐఏ డాక్యుమెంట్లు వెల్లడించాయి. బయటిదేశంతో మిత్రబంధం వల్ల జాఫ్నా ప్రాంతంలో శాంతి సాధ్యం కాదన్న సంగతి తెలిసి కూడా డీల్ కుదుర్చుకోవాల్సి వచ్చిందని లంక అధ్యక్షుడు తనకు తెలిపినట్టు పేర్కొన్నారు.