: ఖజానాకు రూ. 45 వేల కోట్లు చేర్చడమే లక్ష్యం: జైట్లీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సంస్థల్లో వాటాలను విక్రయించడం ద్వారా రూ. 45 వేల కోట్లను ఖజానాకు చేర్చాలని ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ ఏర్పాటు చేసిన ప్యానల్ డిస్కషన్ లో పాల్గొన్న ఆయన, ఇప్పటివరకూ రూ. 30 వేల కోట్లను షేర్ బై బ్యాక్, ఈటీఎఫ్, ఐపీఓ విధానంలో సమకూర్చామని, 2016-17 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా, మిగతా లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన అన్నారు. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కాని ప్రభుత్వ రంగ సంస్థల్లో కొద్దిపాటి వాటాలను విక్రయిస్తామని ఆయన తెలిపారు. కాగా, వచ్చే సంవత్సరంలో ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీ, ఐఆర్ కాన్ లను లిస్టింగ్ చేయడం ద్వారా రూ. 72,500 కోట్లను సమీకరించాలని నిర్ణయించినట్టు తన బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే.