: ఏపీని వణికిస్తున్న 'ఎయిడ్స్'.. తూర్పులో మళ్లీ జడలు విప్పిన మహమ్మారి
రెండు దశాబ్దాల క్రితం ఏపీని భయపెట్టిన ఎయిడ్స్ మహమ్మారి మరోమారు జడలు విప్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ ఎయిడ్స్ వార్తలతో చంద్రబాబు సర్కారు అప్రమత్తమైంది. ఎయిడ్స్ నివారణకు ఇప్పటి నుంచే రంగంలోకి దిగకపోతే నవ్యాంధ్ర ప్రతిష్ఠకు తీరని భంగం వాటిల్లుతుందని భయపడుతోంది. దీంతో చర్యలకు ఉపక్రమించింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం గుంటూరు జిల్లాలో 5.4 శాతం మంది ఎయిడ్స్ బారినపడడం అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం మళ్లీ అదే తీవ్రత అక్కడ కనిపిస్తోంది. అయితే కేసుల నమోదులో మాత్రం మిగతా జిల్లాల కంటే తూర్పు గోదావరి జిల్లా ముందుంది. 2015-16లో ఈ ఒక్క జిల్లాలోనే ఏకంగా 3,538 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 2,700, కృష్ణాలో 2,693 కేసులు పాజిటివ్‌గా తేలాయి.
ఎయిడ్స్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నట్టు వార్తలు రావడంతో ప్రత్యేక ఆరోగ్య బృందాలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యకళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో తిరిగి మొత్తం 4.9 లక్షల మందిని కలిశాయి. వీరిలో 12,742 మందిని పాజిటివ్‌గా గుర్తించారు. మొత్తం కేసుల్లో 42 శాతం కేసులు తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే నమోదుకావడం కలవరపాటుకు గురిచేస్తోంది.