: కేసీఆర్‌కు దొరకని ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్.. వాయిదాపడిన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన
చివరి నిమిషంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ కారణంగా 6వ తేదీన అపాయింట్‌మెంట్ ఇవ్వలేమని పీఎంవో వర్గాలు శనివారం రాత్రి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చాయి. పర్యటనను వాయిదా వేసుకోవాల్సిందిగా సూచించాయి. దీంతో ఎస్సీ వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తలపెట్టిన అఖిలపక్షాల ఢిల్లీ యాత్ర వాయిదా పడింది. ఈమేరకు పర్యటనను వాయిదా వేస్తున్నట్టు సీఎంవో కార్యాలయం ప్రకటించింది.
ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరేందుకు అఖిలపక్షంతో కలిసి ఢిల్లీ వెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇదివరకే నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. అఖిలపక్ష బృందంలో కాంగ్రెస్, టీడీపీ, మజ్లిస్‌లు కూడా ఉన్నాయి. నేటి(ఆదివారం) సాయంత్రం ఢిల్లీ వెళ్లేందుకు సర్వం సిద్ధమైన వేళ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన వార్త విని సర్కారు విస్మయానికి గురైంది. ఆ వెంటనే పర్యటన వాయిదా పడినట్టు ప్రకటించింది.