: మలుపు తిరుగుతున్న డాక్టరు గారి 'ఆడి కారు' ప్రమాదం కేసు!


ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జనవరి 27న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆడి క్యూ7 కారు ఓ ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురూ మృత్యువాతపడ్డారు. ఈ కారు సఫ్దర్ జంగ్ హాస్పిటల్ కు చెందిన సర్జన్ మనీశ్ రావత్ దని తేలింది. ఆ వెంటనే, ప్రమాదం జరిగిన సమయంలో సదరు కారు నడిపింది తానేనంటూ ఇషాక్ అహ్మద్ అనే వ్యక్తి వచ్చి మెజిస్ట్రేట్ ఎదుట లొంగిపోయాడు. అనంతరం అతనికి కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది.

అయితే, అతని అడ్రెస్ ప్రకారం మీడియా సంస్థలు ఆరాతీయగా, బరేలీలోని లభేదా గ్రామంలో అతను ఉంటున్నట్టు తెలిసింది.  ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే, ఆ ఊర్లో ఇషాక్ అహ్మద్ అనే పేరున్న వ్యక్తులు ఇద్దరు ఉన్నట్టు తేలింది. ఒక ఇషాక్ అహ్మద్ ట్రక్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ప్రమాదం జరిగిన రోజు తాను గుజరాత్ లో ఉన్నానని, అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయని, ఎవరో తనకు చెడ్డపేరు తెచ్చేందుకు ఇలా చేస్తున్నారని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని అతను తెలిపాడు. అసలు తానింతవరకు ఆడికారు లోపలి భాగాలు కూడా చూడలేదని అతను అంటుండగా, మరో ఇషాక్ అహ్మద్ రోజు కూలీగా పనిచేస్తున్నాడు. అసలిదంతా ఏంటో కూడా తనకు తెలియదని అతను చెబుతున్నారు. దీంతో కారు ఓనర్ అయిన వైద్యుడు కేసు నుంచి తప్పించుకోవడానికి ఇలా ఎవరినో పురమాయించి కేసును తారుమారు చేయాలని చూస్తున్నాడని జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

  • Loading...

More Telugu News