: 'స్కామ్' కు కొత్త అర్థం చెప్పిన మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ స్కామ్ (SCAM) అనే పదానికి కొత్త నిర్వచనం చెప్పారు. SCAM అంటే సమాజ్ వాదీ పార్టీ (S), కాంగ్రెస్ పార్టీ (C), అఖిలేష్ యాదవ్ (A), మాయావతి (M) అని చెప్పారు. మీకు స్కాం కావాలో లేక రాష్ట్ర అభివృద్ధి కావాలో తేల్చుకోవాలంటూ యూపీ ఓటర్లను ఉద్దేశించి అన్నారు. ఈ రోజు ఆయన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ములాయం సింగ్ కుటుంబంలో ఇటీవల తలెత్తిన విభేదాలన్నింటినీ ఎన్నికల డ్రామాగా కొట్టి పారేశారు. సమాజ్ వాదీ పార్టీ పాలనలో యూపీ అభివృద్ధి వెనుకబడిపోయిందని మోదీ అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 4 వేల కోట్లను కేటాయిస్తే, అఖిలేష్ ప్రభుత్వం మాత్రం రూ. 250 కోట్లను కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ కు సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం వస్తే, రైతుల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.