: సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ధోనీ సందడి!


క్రీజులో అడుగుపెడితే చాలు... ఫార్మాట్ ఏదైనా సరే, స్కోరు బోర్డు పరుగులు పెట్టాల్సిందే. అతడే సెహ్వాగ్. సొంత గడ్డా, విదేశీ గడ్డా అనేది వీరూకు అనవసరం. బౌలర్లను ఊచకోత కోయడం మాత్రమే అతనికి తెలుసు. అందుకే, సచిన్ ను అభిమానించినంతగా సెహ్వాగ్ ను కూడా క్రికెట్ ప్రేమికులు అభిమానించారు. అయితే, ధోనీతో విభేదాల కారణంగానే, అంతర్జాతీయ క్రికెట్ కు వీరూ బలవంతంగా వీడ్కోలు చెప్పాడనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో తమ ఇద్దరి మధ్యలో అలాంటిది ఏమీ లేదని... తామిద్దరం మంచి స్నేహితులం అని ధోనీ, వీరూ సంకేతాలు ఇచ్చారు.

వివరాల్లోకి వెళ్తే, హర్యాణాలోని బజ్జార్ లో సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ను వీరూ స్థాపించాడు. ఈ స్కూల్ ను ధోనీ సందర్శించాడు. అంతేకాదు, సెహ్వాగ్ తో కలసి విద్యార్థులతో పిచ్చాపాటీ మాట్లాడుతూ గత జ్ఞాపకాలను పంచుకున్నాడు. చక్కగా చదువుకోవడానికి, ఆటలను ఎంజాయ్ చేయడానికి స్కూల్ చక్కటి వేదిక అని ధోనీ చెప్పాడు. తన స్కూల్ జీవితం కూడా చాలా అద్భుతంగా సాగిందని తెలిపాడు. విద్యార్థి దశలో ఎలాంటి ఒత్తిడి మనపై ఉండదని... ఆ తర్వాత పరుగులు పెట్టే జీవితానికి ప్రతి ఒక్కరూ అలవాటుపడాల్సి వస్తుందని చెప్పాడు. అందమైన ఈ బాల్యాన్ని ఆస్వాదించండంటూ విద్యార్థులకు చెప్పాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

  • Loading...

More Telugu News