: బిన్ లాడెన్ ఫ్యామిలీ డాక్టరు పిల్లలకు గుర్తింపు కార్డులు ఇచ్చేది లేదన్న ‘పాక్’!
బిన్ లాడెన్ ఫ్యామిలీ డాక్టరు షకీల్ అఫ్రిది పిల్లలకు గుర్తింపు కార్డులు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నిరాకరించినట్లు షకీల్ లాయర్ ఖమర్ నదీమ్ పేర్కొన్నారు. పెషావర్ లో ఈరోజు ఆయన మాట్లాడుతూ, షకీల్ కొడుకు (21), కూతురు (19) కళాశాలలో చేరే నిమిత్తం నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్, అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే, వాటిని మంజూరు చేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నిరాకరించిందని చెప్పారు.
కళాశాలలో చేరాలంటే ఆ పత్రాలు, ఐడెంటిటీ కార్డ్స్ అవసరమని అన్నారు. ఈ విషయమై నేషనల్ డేటా బేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ (ఎన్ఏడీఆర్ఏ)కి లేఖ రాసినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదన్నారు. గుర్తింపు కార్డును కలిగి ఉండటమనేది ప్రతి పౌరుడి హక్కు అని, ఈ విషయమై పెషావర్ హైకోర్టును ఆశ్రయిస్తామని నదీమ్ పేర్కొన్నారు. దేశ ద్రోహ నేరం కింద ప్రస్తుతం జైలులో ఉన్న షకీల్ అక్కడి నుంచి తప్పించుకోలేడు కదా? దేశం విడిచి పారిపోలేడుగా? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.
కాగా, 2011లో అల్ ఖైదా అధినేత బిన్ లాడెన్ ను పాకిస్థాన్ లోని అబోటాబాద్ లో అమెరికా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. లాడెన్ ఫ్యామిలీకి సంబంధించిన డీఎన్ఏ నమూనాలు సేకరించే విషయంలో సీఐఏ కు డాక్టరు షకీల్ అఫ్రిది సాయపడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. బిన్ లాడెన్ ను హతమార్చిన అనంతరం షకీల్ ను పాకిస్థాన్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో ఉంచింది.