: దావూద్ ను కచ్చితంగా పట్టుకొస్తాం: రాజ్ నాథ్ సింగ్


ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను తప్పకుండా పట్టుకొస్తామన్న నమ్మకం తమకు ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి ధీమాగా చెప్పారు. ఈరోజు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మరిన్ని సర్జికల్ దాడులు జరిగే అవకాశాలను ఏమాత్రం తీసి పారేయలేమని అన్నారు.

సీమాంతర ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని చెబుతున్న పాకిస్థాన్ మాటలు నమ్మడానికి వీల్లేదని అన్నారు. పాకిస్థాన్ కు చెందిన ఉగ్ర సంస్థలు భారత్ పైకి దాడి చేసేందుకు వస్తే తాము ఏమాత్రం సహించమని, మరిన్ని సర్జికల్ దాడులు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అయితే, అటువంటి దాడులు చేయాలని మాత్రం తాము కోరుకోవడం లేదని అన్నారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ను గృహ నిర్బంధం చేయడం కేవలం కంటి తుడుపు చర్యేనని, పాకిస్థాన్ ఈ పాటికే ఆయన్ని జైల్లో పెట్టి ఉండాల్సిందని అన్నారు. 

  • Loading...

More Telugu News