: ఆంధ్రా చేపలకు అస్సాంలో గిరాకీ
ఆంధ్రప్రదేశ్ చేపలకు అస్సాం రాష్ట్రంలో మంచి గిరాకీ పలుకుతోంది. ఈ విషయాన్ని స్వయంగా అస్సాం రాష్ట్ర సహకార మంత్రి, మత్స్యకారుల సంఘం ఛైర్మన్ సిద్దిక్ అహ్మద్ తెలిపారు. ఆంధ్రా నుంచి తమకు చేపల దిగుమతి ఎక్కువగా ఉందనీ, అవీ నాణ్యమైన చేపలు కావడంతో డిమాండ్ భారీగా ఉందని హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన చెప్పారు. నగరంలోని రామాంతపూర్‌లో చెరువులను, చేపల మార్కెట్లను ఈరోజు ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ఇక్కడి చేపలకు అస్సాంలో మంచి పేరుందన్నారు. ఈ గిరాకీని క్యాష్ చేసుకుంటున్న దళారీ వ్యవస్థ కూడా భారీగానే ఉందన్నారు. ఈ కారణంగా మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆంధ్రా చేపలను మధ్యవర్తిత్వం ద్వారా కాకుండా నేరుగా కొనుగోలు చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.