: ఇంటిపై పూల వర్షం కురిపించుకుంటా... లేకుంటే పరువు పోతుందంటూ హైకోర్టును ఆశ్రయించిన వ్యక్తి
తన కొత్త ఇంటి గృహప్రవేశం సందర్భంగా పూలవర్షం కురిపించుకునేందుకు హెలికాప్టర్ వాడుకుంటానని, అందుకు అనుమతించాలని ఓ వ్యక్తి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఆసక్తికరమైన ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ నెల 9న తన కొత్త ఇంటి గృహప్రవేశం ఉందని, ఆ సమయంలో ఆకాశం నుంచి పూలవర్ష ప్రదర్శన ఉంటుందని ఆహ్వాన పత్రికల్లో ప్రచురించానని, హెలికాప్టర్ ను అద్దెకు తీసుకోవాలని చూస్తే, వారు పోలీసు కమిషనర్ నుంచి అనుమతి పత్రాన్ని కోరుతున్నారని మునిరాజు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
బెంగళూరు ఈస్ట్ తాలూకాలోని ముల్లూర్ గ్రామంలో తాను కొత్త ఇంటిని నిర్మించుకున్నానని తెలిపాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం, సమానత్వపు హక్కు తనకుందని చెప్పాడు. తన పక్కింటి వ్యక్తి గతంలో గృహ ప్రవేశం చేసినప్పుడు పూలవానకు అనుమతిచ్చారని, ఇప్పుడు తాను కూడా అదే పని చేయకుంటే పరువు పోతుందని వాపోయాడు. ఇక ఇంత భారీ ఏర్పాట్ల, ఆడంబరం ఎందుకని ప్రశ్నించిన జస్టిస్ బొప్పన్న, పోలీసు శాఖకు నోటీసులు జారీ చేశారు. అంతకుముందు ప్రభుత్వ న్యాయవాది తన వాదన వినిపిస్తూ, పిటిషనర్ పై ఇటీవలి వరకూ రౌడీ షీట్ ఓపెన్ అయి ఉందని, ఆయన తొలుత పౌరవిమానయాన శాఖ నుంచి నిరంభ్యంతర పత్రం తీసుకొచ్చి పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఇవ్వాల్సి వుంటుందని తెలిపారు.