: చిక్కుల్లో శశికళ... ఈడీ కేసులో కింది కోర్టు తీర్పు రద్దు


ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు గద్దెనెక్కాలని భావిస్తూ, తనదైన పావులు కదుపుతున్న శశికళ చిక్కుల్లో పడ్డారు. గతంలో ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసుల్లో శశికళతో పాటు ఆమె బంధువు దినకరన్ కు విముక్తి కల్పిస్తూ, కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్టు హైకోర్టు మధురై బెంచ్ ప్రకటించింది. కేసులో తీర్పును ప్రకటించిన జస్టిస్ జి చొక్కలింగం, ఈడీ కేసులను ఆమె ఎదుర్కోక తప్పదని తేల్చారు.

ఈ కేసుల పూర్వపరాల్లోకి వెళితే, శశికళ వాటాదారుగా ఉన్న భరణి బీచ్ రిసార్ట్స్ సంస్థకు రామస్వామి అనే వ్యక్తి నుంచి రూ. 3 కోట్ల రుణం అందగా, ఆ మొత్తంలో రూ. 2.2 కోట్లను కొడనాడు ఎస్టేట్స్ లో వాటాగా ఇన్వెస్ట్ చేశారు. దీనికి ఆర్బీఐ అనుమతి తీసుకోలేదని, విదేశీ మారకద్రవ్యం చేతులు మారిందని శశికళ, దినకరన్, జేజే టీవీ తదితరులపై 1996లో ఈడీకి ఫిర్యాదు అందింది. ఆపై విచారణ జరిపిన ఈడీ కేసు నమోదు చేయగా, దీంతో తనకు సంబంధం లేదని, తనను తప్పించాలని చెన్నై ఆర్థిక నేరాల న్యాయస్థానంలో శశికళ పిటిషన్ వేశారు. దీనిపై 2015లో కోర్టు తీర్పిస్తూ, కేసు నుంచి ఆమెను తప్పించింది. దీనిపై ఈడీ అపీలు చేయగా, వాదనలు విన్న అనంతరం తీర్పు వెలువడింది. శశికళ జోక్యంపై అవసరమైన డాక్యుమెంట్లు ఉన్నాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News