: లోకేష్ ను మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నాం: టీడీపీ నేతలతో చంద్రబాబు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు మంత్రి పదవి ఖాయమైంది. కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలతో పాటు, పార్టీ నేతల డిమాండ్ కు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తలొగ్గారు. ఈ నేపథ్యంలో లోకేష్ ను కేబినెట్ లోకి తీసుకుంటున్నట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు. తెలంగాణ టీడీపీ నేతలతో విజయవాడలో నిన్న సమావేశమైన సందర్భంగా ఈ విషయం స్పష్టం చేశారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ పార్టీ బాధ్యతలు లోకేష్ కు అప్పగించాలని టీడీపీ-టీఎస్ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు లోకేష్ ను మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నామని, ఆయనకు తెలంగాణ బాధ్యతలు అప్పగించడం కుదరదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీని బలపరచడం, సభ్యత్వ నమోదు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చంద్రబాబు నేతలతో చర్చించారు.