: నిఘాకు కొత్త అస్త్రం రోబో గబ్బిలం...డ్రోన్ల అవసరం తీర్చనుందా?
ఈవేళ డ్రోన్లు నిఘా వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. శక్తిమంతమైన డ్రోన్లతో విదేశాల రహస్య కార్యకలాపాలపై ఓ కన్నేసి వుంచడం సాధ్యపడుతోంది. ఈ మధ్యే భారత భూభాగంలో 12 వేల అడుగుల ఎత్తులో తన విమానానికి దగ్గర్లో ఓ డ్రోన్ కనిపించిందని, ఏవియేషన్ విభాగానికి సదరు పైలట్ ఫిర్యాదు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అందుకే, డ్రోన్ లపై వివిధ దేశాల్లో నిషేధం అమలవుతోంది. తాజాగా ఈ డ్రోన్ ల స్థానంలో గబ్బిలాల్లాంటి రోబోను కాల్ టెక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది అచ్చం గబ్బిలంలా రెక్కలు విప్పుకుని, వాటిని పైకి, కిందకు అల్లాడిస్తూ ప్రయాణిస్తూ పని చేస్తుంది. దీనితో ఎన్నో ఉపయోగాలున్నాయని దీన్ని తయారు చేసిన కాల్ టెక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దీనిని గాల్లో నిలిపి ఉంచేందుకు డ్రోన్ ల మాదిరిగా ఇంజన్లు నిత్యం ఆన్ లో ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. అంతే కాకుండా అతి తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం వెళ్లడం దీనితోనే సాధ్యమని చెబుతున్నారు. కేవలం 93 గ్రాముల బరువు ఉండే ఈ రోబోను చిన్న చిన్న ప్రదేశాల్లోనూ సులువుగా తిప్పవచ్చని వారు భరోసా ఇస్తున్నారు. దీని రెక్కలు సుమారు ఒక అడుగు విస్తీర్ణంలో విచ్చుకుంటాయని, గబ్బిలాల మాదిరిగానే తన రెక్కల మధ్యలో ఉండే అనేక కీళ్లను కదిలిస్తూ ఇది ముందుకు కదులుతుందని వారు చెబుతున్నారు. ఎగిరేటప్పుడు గాలి ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా ఈ రెక్కలను 56 మైక్రాన్ల మందమున్న ప్రత్యేకమైన సిలికాన్ పదార్థంతో తయారు చేశామని వారు వెల్లడించారు. కాగా, దీనికి సరికొత్త మార్పులు చేర్పులు చేస్తే నిఘా వ్యవస్థకి ఎంతో ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.