: అమెరికాలో స్టేడియంలు నిర్మిస్తున్న ‘క్రికెట్’ ప్రేమికుడు!


క్రికెట్ అంటే ఆయనకు ఎంతో అభిమానం.  ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ లు జరిగినా తన ఇద్దరు కొడుకులతో కలిసి మరీ, అక్కడికి వెళుతుండేవాడు. అంతటితో ఆగలేదు, క్రికెట్ పై తనకున్న అభిమానాన్ని స్టేడియం లు కట్టించడం ద్వారా చాటి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకీ, ఆ వీరాభిమాని ఎవరంటే.. గుజరాత్ లో జన్మించిన జిగ్నేశ్ పాండ్య. రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన ఆయన ప్రస్తుతం అమెరికాలో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు.

అసలు క్రికెట్ స్టేడియాలు నిర్మించాలనే ఆలోచన తనకు ఎందుకు వచ్చిందనే విషయమై జిగ్నేశ్ పాండ్య మాట్లాడుతూ, తాను మ్యాచ్ లను వీక్షించేందుకు వెళ్లినప్పుడు భారత్ తో పాటు అమెరికాకు చెందిన క్రికెట్ అభిమానులు కూడా ఎక్కువగా ఉండేవారని చెప్పారు. అమెరికాలో క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉండటంతో ఇదో పెద్ద మార్కెట్ గా అవతరించనుందని, ఇక్కడ క్రీడల ద్వారా మిలియన్ డాలర్ల రెవెన్యూ వస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే, క్రికెట్ కు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా అమెరికా వ్యాప్తంగా ఎనిమిది క్రికెట్ స్టేడియాలు నిర్మించాలని ప్రణాళికలు తయారు చేసినట్లు చెప్పారు. కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, ఫ్లోరిడా, జార్జియా, టెక్సాస్, ఇల్లినాయిస్, న్యూజెర్సీల్లో ఒక్కో స్టేడియం నిర్మించనున్నానని, ఒక్కో స్టేడియం సామర్థ్యం ఇరవై ఆరు వేల మంది వరకు ఉంటుందని అన్నారు. అమెరికాలో స్టేడియాల నిర్మాణానికి, క్రికెట్ ను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు 2.4 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు చెప్పిన జిగ్నేశ్ పాండ్య, వీటి నిర్మాణంతో కొత్త ఉద్యోగాలు వేల సంఖ్యలో లభిస్తాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News