: పెరిగిపోతున్న నిరాశావాదులు.. మనం మాత్రం కాస్త బెటరే.. సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు ఇవిగో!
ప్రపంచంలో మూడింట రెండొంతల మంది ప్రజలు తమ దేశం సరైనా పంథాలో ప్రయాణించడం లేదని అంటున్నారని ఇప్సోస్, మోరిస్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రపంచంలోని 25 దేశాల్లో వేలాది ప్రజలను ఆ సర్వేలో భాగంగా ఆ సంస్థల ప్రతినిధులు ప్రశ్నించడం ద్వారా ఈ విషయం తేలింది. తమ దేశం సరైన పంథాలోనే ముందుకు వెళుతోందని తాము ప్రశ్నించిన దేశాల ప్రజల్లో 37 శాతం మంది చెప్పగా, లేదని 63 శాతం మంది చెప్పారని ఆ సంస్థలు తెలిపాయి. అయితే, ఈ విషయంలో చైనా, సౌదీ అరేబియా దేశీయులతో పాటు మన దేశ ప్రజలు బెటర్ అని తెలుస్తోంది.
తమ దేశం సరైన మార్గంలోనే ప్రయాణిస్తోందని భావిస్తున్న దేశీయుల్లో చైనా ప్రజలు తొలిస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో సౌదీ అరేబియా, భారత్, రష్యా, అర్జెంటీనా, కెనడా, పెరు, ఆస్ట్రేలియా దేశాలు నిలిచాయి. చైనాలో తాము ప్రశ్నించిన వారిలో 90 శాతం మంది ప్రజలు తమ దేశం సరైన మార్గంలో వెళుతోందని చెప్పగా... భారత ప్రజల్లో 76 శాతం మంది ఆ విధంగా చెప్పారట. ఇక, బ్రెజిల్ మినహా బ్రిక్స్ దేశాలు, దక్షిణ కొరియా మినహా ఆసియా పసిఫిక్ దేశాల ప్రజలు ఈ అంశంపై ఆశావాద దృక్ఫథంతోనే స్పందించారని సర్వే ద్వారా తెలిసింది. ఇక ఇతర ప్రాంతాల దేశాల ప్రజలు ఈ అంశంపై ప్రతికూలంగా స్పందించారని సర్వేలో పేర్కొన్నారు.
ప్రధానంగా లాటిన్ అమెరికా దేశాల ప్రజలు తమ దేశాల భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూలంగా స్పందిస్తూ నిరాశను వ్యక్తం చేశారట. అగ్రరాజ్యం అమెరికా ప్రజలు తమ దేశం సరైన పంథాలో నడుస్తోందని 35 శాతం మంది మాత్రమే చెప్పారట. అయితే, ఈ సర్వేను డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికకాక ముందు నిర్వహించిన సర్వే కావడంతో ఇప్పుడు అక్కడి ప్రజల అభిప్రాయాల్లో మార్పు వచ్చి ఉండవచ్చని అందులో పేర్కొన్నారు.
నిరుద్యోగ సమస్య కారణంగా అధిక శాతం మంది ప్రజలు తమ దేశం సరైన పంథాలో నడవడం లేదని చెప్పారు. నిరుద్యోగం కారణంగా 38 శాతం మంది, దారిద్య్రం, సామాజిక అసమానతల కారణంగా 34 శాతం మంది, ఆర్థిక, రాజకీయ అవినీతి కారణంగా 33 శాతం మంది; నేరం, హింస కారణంగా 29 శాతం మంది అలా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. ఇక వైద్య సౌకర్యాలు సరిగా లేకపోవడం కారణమని 22 శాతం మంది చెప్పారు. ఇప్సోస్, మోరిస్ సంస్థ నిర్వహిస్తోన్న ఇటువంటి సర్వేను 2010వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది చేస్తున్నారు. అయితే, గతేడాది 35 శాతంగా ఉన్న నిరాశవాదుల సంఖ్య 37 శాతంకి చేరుకుంది.