: నేలపై కూర్చుని సహపంక్తి భోజనం చేసిన రాహుల్!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేలపై కూర్చుని గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. అంతకుముందు, బలియన్ గ్రామంలో రాహుల్ గాంధీ పర్యటించారు. గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం, వారితో కలిసి ఆయన భోజనం చేశారు. రాహుల్ తో కలిసి వృద్ధులు, మహిళలు, యువత భోజనాలు చేశారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ, ఇతర పార్టీల వలలో పడవద్దని ఈ సందర్భంగా ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందని అన్నారు. కాగా, పంజాబ్ రాష్ట్రంలో 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.